Friday, 11 March 2022

జన్మభూమి

దేశ మేగినా, ఎందు కాలిడిన

పీఠమెక్కినా, యెవ రెదు రయిన

పొగడరా, నీ తల్లి భూమి భారతిని,

నిలుపరా, నీ జాతి నిండు గౌరవము :

 

పూర్వపుణ్యమో, యోగబలమో,

జనియించినాడ నీ స్వర్గఖండమున

మంచిపూవులన్ ప్రేమించినావో

నిను మోచె, తల్లి కనక గర్భమున :

లేదురా, యిటువంటి భూదేవి యెందు,

లేరురా, మనవంటి పారు లిం కెందు :

 

సూర్యుని వెలుతురు సోకునందాక,

ఓడలజెండాలు ఆడునందాక,

నరుడు ప్రాణాలతో నడుచునందాక,

అందాక గల యనంతభూతలిని

మనభూమివంటి చల్లని భూమి లేదు :

పాడరా నీ తెన్గు బాలగీతములు,

పాడరా నీ వీరభావభారతము :

 

తమ తపస్సులు ఋషుల్ ధారబోయంగ,

శౌర్యహారము రాజ చంద్రు లర్పింప,

రాగదుగ్దము భక్త రత్నముల్ పిదుక

భావ సూత్రము కవిప్రభువు లల్లంగ

దిక్కుల కెగదన్ను తేజమ్ము వెలుగ,

జగముల నూగించు మగతనం బెగయ,

రాళ్ళ తేనియలూరు రాగాలు సాగ

సౌందర్య మెగబోయు సాహిత్య మలర,

వెలిగిన దీ దివ్యవిశ్వంబు పుత్ర :

అవమాన మేలరా, అనుమాన మేల,

భరత పుత్రుండ నంచు భక్తితో బలుక :

-      రాయప్రోలు


ప్రబోధము

  అమరావతీ పట్టణమున బౌద్దులు విశ్వ విద్యాలయములు స్థాపించునాడు, ఓరుగల్లున రాజవీరలాంఛనముగ బలు శస్త్రశాలలు నిలుపునాడు, విద్యానగర రాజవీధు...