Saturday, 12 March 2022

దేశ భక్తి

 దేశమును ప్రేమించుమన్నా,

మంచి అన్నది పెంచుమన్నా,

వొట్టిమాటలు కట్టిపెట్టవోయి :

గట్టి మేలు తలపెట్టవోయి :

 

పాడిపంటలు పొంగిపొర్లే

దారిలో నువ్వు పాటుపడవోయి ;

తిండి కలిగితె కండ కలదోయి,

కండగలవాడేను మనిషోయి :

 

యీసురోమని మనుషులుంటే

దేశ మేగతి బాగుపడునోయి ?

జల్దుకొని కళలెల్ల నేర్చుకు

దేశిసరుకులు నించవోయి :

 

అన్నిదేశాల్ క్రమ్మవలెనోయి

దేశిసరుకుల నమ్మవలెనోయి :

డబ్బు తేలేనట్టి నరులకు

కీర్తి సంపద లబ్బవోయి :

 

వెనక చూచిన కార్య మెమోయి ?

మంచి గతమున కొంచెమేనోయి

మందగించక ముందు అడుగేయ్ :

వెనకపడితే వెనకేనోయ్ :

 

పూను స్పర్ధను విద్యలందే

వైరములు వాణిజ్యమందే ;

వ్యర్ధకలహం పెంచబోకోయ్

కత్తివైరం కాల్చవోయ్ :

 

దేశాభిమానం నాకు కద్దని

ఒట్టిగొప్పలు చెప్పుకోకోయ్,

పూని యేదై నాను ఒక మేల్

కూర్చి జనులకు చూపవోయ్ :

 

ఓర్వలేమిపిశాచి, దేశం

మూలుగులు పీల్చేసెనోయ్ :

ఒరుల మేలుకు సంతసిస్తూ

ఐకమత్యం నేర్చవోయ్ :

 

పరుల కలిమికి పొర్లి యేడ్చే

పాపి కెక్కడ సుఖం కద్దోయ్ ?

ఒకరి మేల్ తన మే లనెంచే

నేర్పరికి మేల్ కొల్లలోయ్ :

 

స్వంత లాభం కొంత మానుకు

పొరుగువాడికి తోడుపడవోయ్:

దేశమంటే మట్టికాదోయ్,

దేశమంటే మనుషులోయ్:

 

చెట్టపట్టాల్ పట్టుకొని

దేశస్థు లంతా నడవవలెనోయి,

అన్నదమ్ములవలెను జాతులు

మతము లన్నీ మెలగవలెనోయ్:

 

మతం వేరై తేను యేమోయ్ ?

మనసు లొకటై మనుషు లుంటే

జాత మన్నది లేచ్చి పెరిగి

లోకమున రాణించునోయ్ :

 

దేశమనియెడి దొడ్డవృక్షం

ప్రేమలను పూలెత్తవలెనోయ్,

నరుల చెమటను తడిసి మూలం

ధనం పంటలు పండవలెనోయ్ :

 

ఆకులందున అణిగి మణిగీ

కవిత కోకిల పలక వలెనోయ్,

పలుకులను విని, దేశమం దభి

మానములు మొలకెత్తవలెనోయ్ :

-                              -   గురజాడ అప్పారావు

ప్రబోధము

  అమరావతీ పట్టణమున బౌద్దులు విశ్వ విద్యాలయములు స్థాపించునాడు, ఓరుగల్లున రాజవీరలాంఛనముగ బలు శస్త్రశాలలు నిలుపునాడు, విద్యానగర రాజవీధు...